Tuesday, January 13, 2026

కేఎల్‌ రాహుల్‌ భారీ సెంచరీ.. ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్‌

IND A vs AUS A 2nd Unofficial Test Day 4: KL Rahul 176 India Beat Australia

ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. కేఎల్‌ రాహుల్‌   భారీ శతకం బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా.. సాయి సుదర్శన్‌   సెంచరీతో అలరించాడు. ఇక కెప్టెన్‌ ధ్రువ్‌ జురెల్‌ సైతం అద్భుత అర్థ శతకంతో ఆకట్టుకున్నాడు. భారత్‌- ‘ఎ’ జట్టుతో రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డే సిరీస్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా టీమ్‌ ఇక్కడకు వచ్చింది. ఇందులో భాగంగా లక్నోలో తొలుత టెస్టులు జరుగగా.. మొదటి టెస్టు డ్రాగా ముగిసింది.

ఫలితం తేలింది

ఈ క్రమంలో మంగళవారం మొదలైన రెండో అనధికారిక టెస్టులో మాత్రం.. ఆఖరి రోజైన శుక్రవారం నాటి నాలుగో రోజు ఆటలో ఫలితం తేలింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌.. తొలుత బౌలింగ్‌ చేసింది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌.. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. కెప్టెన్‌ నాథన్‌ మెక్‌స్వీనీ (74), జాక్‌ ఎడ్‌వర్డ్స్‌ (88), టాడ్‌ మర్ఫీ (76) అర్ధ శతకాలతో రాణించగా.. 97.2 ఓవర్లలో 420 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో మానవ్‌ సుతార్‌ ఐదు వికెట్లతో చెలరేగగా.. గుర్నుర్‌ బ్రార్‌ మూడు, మొహమ్మద్‌ సిరాజ్, ప్రసిద్‌ కృష్ణ ఒక్కో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక తమ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ నిరాశపరిచింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (11)తో పాటు దేవ్‌దత్‌ పడిక్కల్‌ (1), కెప్టెన్‌ ధ్రువ్‌ జురెల్‌ (1), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (1) పూర్తిగా విఫలమయ్యారు.

ఆసీస్‌కు 226 పరుగుల భారీ ఆధిక్యం
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మరో ఓపెనర్‌ నారాయణ్‌ జగదీశన్‌ (38) ఓ మోస్తరుగా రాణించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ 75 పరుగులతో సత్తా చాటాడు. ఆయుశ్‌ బదోని 21 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 194 పరుగులు చేసి భారత్‌ ఆలౌట్‌ కాగా.. ఆసీస్‌కు 226 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా ఈసారి 185 పరుగులకే చాపచుట్టేసింది. కెప్టెన్‌ నాథన్‌ మెక్‌స్వీనీ (85 నాటౌట్‌), వికెట్‌ కీపర్‌ జోష్‌ ఫిలిప్‌ (50) వల్లే ఈ మాత్రం స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో మానవ్‌ సుతార్‌, గుర్నూర్‌ బ్రార్‌ మరోసారి ఆకట్టుకున్నారు. వీరిద్దరు చెరో మూడు వికెట్లు తీయగా.. యశ్‌ ఠాకూర్‌, సిరాజ్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని ఆసీస్‌ భారత్‌ ముందు 412 పరుగుల (226+185) భారీ లక్ష్యం ఉంచింది. ఈ క్రమంలో గురువారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది భారత్‌.

రాహుల్‌, సాయి శతకాలు..  టార్గెట్‌ పూర్తి చేసిన భారత్‌

అయితే, 74 పరుగుల వద్ద కేఎల్‌ రాహుల్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇక 169/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో భారత్‌ నాలుగో రోజు ఆట మొదలుపెట్టగా.. రాహుల్‌ తిరిగి బ్యాట్‌ పట్టి మైదానంలో దిగాడు. మొత్తంగా 210 బంతులు ఎదుర్కొని 176 పరుగులతో అజేయంగా నిలిచాడు.

మరోవైపు.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ (100) కూడా శతకం సాధించాడు. అయితే, నైట్‌ వాచ్‌మన్‌ మానవ్‌ సుతార్‌ (5) వచ్చీ రాగానే వెళ్లిపోగానే.. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (5) మరోసారి నిరాశపరిచాడు. ఈ క్రమంలో రాహుల్‌కు తోడైన కెప్టెన్‌ జురెల్‌ 66 బంతుల్లో 56 పరుగులతో సత్తా చాటాడు. ఇక నితీశ్‌ కుమార్‌ రెడ్డి 16 పరుగులతో అజేయంగా నిలిచి రాహుల్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

భారత్‌-‘ఎ’ వర్సెస్‌ ఆస్ట్రేలియా- ‘ఎ’ రెండో అనధికారిక టెస్టు సంక్షిప్త స్కోర్లు
వేదిక: ఏకనా స్టేడియం, లక్నో
టాస్‌: భారత్‌.. తొలుత బౌలింగ్‌
ఆస్ట్రేలియా-ఎ: 420 & 185
భారత్‌-ఎ: 194 & 413/5
ఫలితం: ఐదు వికెట్ల తేడాతో ఆసీన్‌ను ఓడించిన భారత్‌.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!